సాగిపో నువ్ సాగిపో!
నీకంటూ సాధించాలనే ఒక ఆశయం ఉంది.. అది సాధించటానికై సాగిపో..
నీవెంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు రానీ ఆగకు, ఎదురుకో, సాగిపో..
పడ్డావా?! అయినా సరే లేచి, పుంజుకుని మనుముందుకు సాగిపో..
వేసే ప్రతీ అడుగులో నిన్ను నువ్వు గ్రహించుకో, నడతను మెరుగుపరుచుకుని సాగిపో..
నిన్ను నీవే నమ్ము, నీకు నీవే విధాతవు, పరిశీలించు ఎరుకతో సాగిపో..
ఎన్ని ఉదయాలు వచ్చి, ఎన్ని అస్తమయాలు జరిగినా, రేపన్నది ఉంటుందని ఎరిగి ఆశయ సాధనకై సాగిపో..
పొగిడేవాడు పొగడని, తెగడేవాడు తెగడని, ఛీత్కరించే వాడు ఛీత్కరించని, సత్కరించే వాడు సత్కరించని ఆగక ఆశయం కోసమై సాగిపో..
ప్రశ్నించేవాడు ప్రశ్నించని, ప్రోత్సాహించేవాణ్ణి ప్రోత్సహించని కృంగిపోకు ఓటమి చూసి, పొంగిపోకు గెలుపును చూసి సాగిపో ఇక సాగిపో..
వస్తే రాని, పోతే పోనీ నీ దారి నీ ఆశయం సాధించాల్సింది నువ్వే ఇక సాగిపో..
నీ దారంతా, ఎత్తుపల్లాలు, పూలరేకులు-ముళ్ళతో నిండనీ, బాధపడక సాగిపో నువు సాగిపో..
కాలంతో పాటే వేయ్ ప్రతీ అడుగు, నీ ఉన్నతికై ముందడుగు ఇక సాగిపో..
సుఖమనేది, దుఃఖమనేది, ఆనందమైనా, విచారమైనా నీవెంచగలిగినవే అని తెలుసుకుని సాగిపో..
కష్టమొచ్చినా, నష్టమొచ్చినా దిగులు చెందక మెరుగుపరచుకొని సాగిపో నువు సాగిపో..
ఆశయం ఆయువై, నీకు నీవే స్ఫూర్తివై సాగిపో
అడుగు అడుగున పిడుగులు పడినా, పిడిగుద్దులు చవిచూసినా శాశ్వతమేదీకాదని గ్రహించి సాగిపో ఇక సాగిపో!!
ఆశయసాధనకై నీకు నీవే మార్గదర్శివని తెలుసుకుని సాగిపో.. సాగిపో!!
ఆకాశవీధిలో సాగే కారు మబ్బులు
రవి కిరణాలకు ఎంతసేపు అడ్డుకాగలవ్
జీవితంలో కృషితో సరైన మార్గంలో
సాగే మనిషిని కష్టనష్టాలు ఎంతని ఆపగలవ్
రవి వెలుగులు
మనిషి అడుగులు
కారుమబ్బులైనా
కష్టనష్టాలైనా
కృషివలుడికి చీకట్లు అడ్డుకాగలవా!
జీవిత సత్యమిది
ఎరిగి సాగెను వాడు!!
ప్రయత్నం ఓ పోరాటం!
మన జీవితంలో ఎంతో వింతైన సంఘటనలు జరుగుతుంటాయి.
అనుకున్నవి కొన్ని జరగకపోవచ్చు,
అనుకోనివి కొన్ని జరుగనూవచ్చు!
కొత్తవారు బంధం ఏర్పరచుకొననూవచ్చు!
నిన్నటి వరకు సామాన్యుడిగా ఉన్నవాడు
గొప్ప ఐశ్వర్యవంతుడు అవ్వవచ్చు,
గొప్పవాడు క్రిందకు పడనూవచ్చు!
ఇలా ఎన్నోఎన్నెన్నో...
పరిశీలన చేస్తూ చూస్తూపోతేను!
అన్నిటికీ మూలం ఓ ప్రయత్నం!
ఆ ప్రయత్నం ఎన్నో రకాలై ఉండవచ్చు..
ఎన్నెన్నో కారణాలతో నిండి ఉండవచ్చు!
అదో గొప్పదైన పోరాటం..
తనతో తాను చేసే గొప్ప పోరాటం!!
గుండెనిండా భారం
కంటి నిండా నీరు
ఆ వేపచెట్టు చిగురాకు కొమ్మకు వానసుక్కలు
భిక్కు భిక్కుమంటూ
వానకోసం చూసిన రోజులెన్నో
పడాల్సిన నాడు సరిగ్గా పడుకుండా
కుండపోత కురిసే ఈ నాడు
దోసిట్లో తడిసిన వడ్లను
కంట్లో ఉప్పునీరును
ఆ రైతన్నకు మిగిల్చింది
ఈ అకాలవాన!
A rush of excitement surged as he gazed up at the stars
twinkling in the vast night sky.
Those distant points of light beckoned,
each a gateway to infinite possibilities.
His mind raced with a whirlwind of questions,
igniting a spark of curiosity within him.
What breathtaking secrets lie hidden behind those shimmering dots?
Could there be a planet out there that mirrors our own Earth?
What if life like ours thrived on such a world, waiting to be discovered?
The thought sent shivers down his spine.
He dreamed of a future where he would unravel these cosmic mysteries,
diving headfirst into the unknown.
The universe was calling, and he couldn't wait to answer!
(Translated into English from Telugu Poem "ఓ చిన్నారి కల")
ఓ చిన్నారి కల
ఆకాశంలో చుక్కలు చూస్తూ
కన్నాడు ఆ చిన్నారి ఒక కల
ఆ చుక్కల మాటున దాగున్న ఆశ్చర్య పరచే చిత్రాలెన్నోనని
ఎన్నో ప్రశ్నలు మెదిలాయి ఆ చిన్ని మనసులో
మెరిసే ఒక్కో చుక్క వెనుక రహస్యాలు ఎన్నో ఉండకపోవా?
భూమి వంటి ఇంకో గ్రాహం ఉండకపోదా?
ఉండి ఉంటే దానిపై మనలాంటి జీవం ఉంటుందా?
అనే ప్రశ్నలతో తనకి జలదరింపు కలిగింది
రేపటి తన కలలకు ఆజ్యం పోసింది,
ఏనాటికైనా ఆ నిగూఢ రహస్యాలను ఛేదించాలనే తపనతో
విశ్వం పిలుపుకు, సమాధానం వెతకాలనే తపనతో
ఓ కల కన్నాడు!
సొంతవారి కోసం చేసే త్యాగానికి వెల ఎవరూ కట్టలేరు
ఆ త్యాగం బంధాలను బలపరుస్తుంది!
మనోధైర్యం, గుండెనిబ్బరం ఉండాలి,
అవి వ్యక్తిత్వ వికాసం ద్వారా మాత్రమే వృద్ధి చేసుకోగలం!
రత్నాల ఉంగరాలు, తాయత్తుల వల్ల ఏమి మారదు జరగదు!
అవి కేవలం నకిలీలు, అవాస్తవమైనవి!
జనాలను అవిద్యకు గురిచేసే ఏ విషయమైనా సంఘానికి మంచిది కాదు.
అటువంటి విషయాలను ప్రభుత్వాలు ప్రోత్సాహించటం సంఘాన్ని తప్పుదోవ పట్టించటమే!
మూఢనమ్మకాలు సమాజాన్ని తప్పుమార్గాన నడుపుతాయి,
అటువంటి వాటికి జనాలు లొంగవద్దు!
అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏర్పడే చేతిగీతలు ఎలా ఉన్నాయోనన్న
దానిబట్టి నీ భవితవ్యం ఎలా తేలుతుంది!
మన చేతల్లోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది!
కష్టం ఎదురొచ్చినప్పుడు కృంగిపోకుండా బాధపడకుండా
అనుకున్నది సాధించాలి ఆ పథంపై సాగాలి!
మనల్ని వెన్నుతట్టి ప్రోత్సాహించేవాళ్ళు ఉన్నా లేకున్నా
నీ పయనం ఆగకూడదు, ఒంటరైనా,
ఎవరు నమ్మినా నమ్మకున్నా మనల్ని మనం నమ్మాలి!
ఆ నమ్మకంతోనే ముందడుగు వేయాలి! అనుకున్నది సాధించాలి!
ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఎదురొడ్డి
నిలబడి సాగేవాడే మార్గదర్శి!
మనల్ని ఓర్వలేనివారు, మన ఓటమి కోరుకునేవారు,
మన చుట్టూ ఉంటారు,
పక్కదారి పట్టించాలని చూస్తారు.
మనం మాత్రం మన అనుకున్నది సాధించేవరకు విచలనం చెందకూడదు!
ఎదుగుతున్న సమయంలో తొందరపాటు పడకూడదు,
కీర్తి, ధనం మన నైపుణ్యాన్ని బట్టి అంచలంచెలుగా వస్తాయి!
బ్రతికున్నప్పుడు ఎలా ఉన్నావు అని పలకరించేవారు
తక్కువ, పోయాక అలా ఉండేవారు, ఇలా ఉండేవారు అని పొగిడేవారు,
బంధాలు కలుపుకునేవారు ఎక్కువ!
మూఢనమ్మకాల వల్ల విజ్ఞత కోల్పోతారు.
ఇంగితం కూడా వాడలేని స్థితికి చేరతారు!
చేతిగీతలు, తలరాతలు అంటూ ఆగిపోతే భవిత మరుగునపడినట్టే!
మూఢనమ్మకాలు పక్కనపెట్టి ముందడుగు వేయాలి.
తన నైపుణ్యాన్ని, కష్టాన్ని నమ్ముకున్నవాడికి
రాశిఫలితాలతో, జాతకంతో పనిలేదు!
సూర్యుని వెలుగుకు కారు మబ్బులు
మనిషి ముందడుగుకు కష్టనష్టాలు ఎప్పటికీ అడ్డుకాగలవా!
ఆశయ సాధనకు కృషి చేసేవాణ్ణి ప్రోత్సాహించాలి,
అది వీలుకాకుంటే మౌనంగా ఉండాలి తప్పుదోవ పట్టించకూడదు!
సాధించాలన్న తపనతో పాటు
ఆచరణ కూడా తోడైతేనే విజయపథం ఏగగలము!
అవసరానికి, అవకాశానికి తేడా ఉంది.
అవసరం ఏదైనా చేసేలా చేస్తే
అవకాశం నచ్చిన విధంగా చేసేలా చేస్తుంది!
తప్పటడుగుల నుండి పాఠం నేర్చి
ముందడుగు ఉన్నతి వైపు వేసేవాడే గొప్పవాడు!
ఎవరు నమ్మినా నమ్మకున్నా మనల్ని మనం నమ్మాలి!
ఆ నమ్మకంతోనే ముందడుగు వేయాలి!
అనుకున్నది సాధించాలి!
మన జీవితం ముఖ్యంగా మన "చేతల్లోనే" ఉంటుంది!
మనం ఏం చేస్తున్నాం అన్నది ఎంతో ముఖ్యం!
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా
ఎన్ని కష్టాలు చవిచూసినా
బాధ్యత కలిగినవాడు
తాను అనుకున్నది ఏనాటికైనా సాధిస్తాడు!
నీతులు, మంచి మాటలు వల్లెవేసి ఏం లాభం ఆచరించనప్పుడు!
కష్టపడగలిగినా అది ఇష్టంలేని వాడే
పరులచెంత బ్రతకడానికైనా ఇష్టపడతాడు, సిద్ధపడతాడు !
మనల్ని అర్థం చేసుకునేవారు
మన చుట్టూ ఉంటే
మనం ఆనందంగా ఉండగలం,
ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలం!
బాధ్యత కొట్టి చెప్పేదో, తిట్టి చెప్పేదో కాదు,
స్వపరిశీలన ద్వారా, పరిస్థితులను అవగతం
చేసుకునే విజ్ఞత వలన మాత్రమే వస్తుంది!
విజ్ఞత ఉన్నవాళ్ళు ఎవరూ
ఒకరి ఇబ్బందులను మరొకరితో పోల్చరు.
అలా పోల్చేవారు చెడును కోరుకునే స్వభావం కలవారు!
మన ఆలోచనలు నిస్సందేహమైనవి అయ్యుంటే,
తెల్ల బల్లి నల్ల పిల్లి అన్న శకునాలు అడ్డురాగలవా?
నైపుణ్యాన్ని నమ్ముకున్నవాడు
శకునాలకు భయపడడు, వెనకడుగువేయడు,
నమ్మకంతో, దృఢసంకల్పంతో ముందుకు సాగుతాడు!
ఈ రోజు కృషి చేస్తేనే
రేపు ఖుషీగా ఉండేది,
కృషికి లేదు ప్రత్యామ్నాయం!
తన నైపుణ్యాన్ని నమ్ముకున్నవాడు
తన చేతలపై దృష్టి పెడతాడు, చేతిగీతలపై కాదు!
సలహాలు, సూచనలు చేయడం వేరు,
మీరు అనుకున్నది ఒకరిపై రుద్దడం వేరు!
కష్టపడి విజయం సాధిస్తూ ఎదుగుతుంటే అదృష్టం అంటారు,
కష్టాల్లో పడితే దరిద్రం, ఏ జన్మలో ఏ పాపం చేశారో అంటారు!
అంతేకానీ హేతుబద్ధంగా కష్టాన్ని గుర్తించరు, ప్రయత్నాన్ని గమనించరు!
ఎదురుచూపు
ఎన్నో వెన్నెల రేయిలు గడిచే
మరెన్నో ఉదయాలను చూసే
నా కన్నులు
నీ రాకకై చూస్తూనే ఉండే
ఇది ప్రేమో, స్నేహమో
విరహమో, కోపమో, బాధో
తెలియకా
నా మనస్సు
ఎదురుచూస్తూనే ఉందే,
నీ జ్ఞాపకాలు
మరవని క్షణమైనా లేదే
నీ తలపులలో
కాలం అలా అలా గడిచిపోయెనే
వసంతాలలా
కన్నుల ముందరే
గడిచిపోయెనే
నీ మాటలకై, నీ నవ్వులకై
ఎన్నెన్నో ఎదురుచూపులే!